బుధవారం సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే పింఛన్ల పెంపు ఉత్సవంలో స్వయంగా పాల్గొననున్నారు. ఈ జనవరి ఒకటో తేదీ నుంచి 66,34,742 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల మొత్తం రూ.1,967.34 కోట్లు విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన మెగాచెక్‌ను ముఖ్యమంత్రి కాకినాడలో ఆవిష్కరిస్తారు. అలాగే, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుకు ఇటీవల జాతీయ స్థాయిలో స్కోచ్ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన ప్లాటినం అవార్డును సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. అంతేకాక.. లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడుతారు. అనంతరం.. రూ.65 కోట్లతో నిర్మించిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ను (ముత్తా గోపాలకృష్ణ వారధి), రూ.20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరామ్‌కుమార్ కళాక్షేత్రాన్ని, రూ.9.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్‌ను సీఎం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిచేశారు. సీఎం పర్యటనకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆయన ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎంపీ వంగా గీత, వైయస్ఆర్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, ఇతర ప్రముఖులు సమీక్షించారు.