రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన 167 సీట్లు గెలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ పరిశీలకులు జీవీ ఆంజనేయులు అన్నారు. మార్కాపురం పట్టణంలోని కందుల నారాయణరెడ్డి ఇంటి వద్ద మంగళ వారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ను ఒక్కసారిగా రూ.1800 పెంచారని గుర్తు చేశారు. జగన్ ఐదేళ్లలో రూ.750 మాత్రమే పెన్షన్ పెంచారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్ అక్రమ కేసులు పెట్టి 52 రోజులు జైల్లో ఉంచారన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సాక్షం కూడా చూపలేక పోయారన్నారు. విశాఖలో సభకు ప్రజల వద్ద నుండి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా సభలో పాల్గొన్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని చంద్రబాబు హయాంలో అభివృద్ధి పథంలో నడిపారన్నారు. జగన్ అడిగిన ఒక్క అవకాశం రాష్ట్రం ప్రజలు ఇవ్వడంతో రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పంచాయతీలలో నిధులు లేక సర్పంచులు చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక, మద్యంలో ప్రభుత్వం ప్రజల వద్ద నుండి అక్రమంగా దోచుకుతింటోందన్నారు. అంతకు ముందు నారాయణరెడ్డి నివాసంలో మార్కాపురం, తర్లుపాడు మండలాల పార్టీ కార్యకర్తలతో మంగళవారం చంద్రబాబుసభ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి 25వేల మందికి పైగా కార్యకర్తలు హాజరు కావాలన్నారు.