అమరావతి కేసుల విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. అమరావతే రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈరోజు (బుధవారం) ఈ పిటిషన్‌పై సుప్రీంలో విచారణకు రాగా.. జస్టిస్ ఖన్నా, జస్టిస్ దత్త ధర్మాసనం కేసును విచారించింది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నా.. హైకోర్టు తీర్పు ఇవ్వడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ కేసులో ఇంకా లిఖితపూర్వక అఫిడవిట్‌లు దాఖలు చేయడం పూర్తి కాలేదని రైతుల తరపున న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది.