ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేరికలు ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీలో వివిధ జిల్లాల నుంచి కీలక నాయకులు వచ్చి చేరుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి.. టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం (జనవరి 3) జరిగిన కార్యక్రమంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారికి పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మరో కీలక నేత దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు సైతం టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య సైతం టీడీపీలో చేరారు. గడికోట ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. తన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందరెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబసభ్యులందరూ టీడీపీలో చేరామని ఆయన అన్నారు.
దివంగత సినీనటుడు నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి.. ద్వారకానాథరెడ్డికి మేనకోడలు. తారకరత్న అంత్యక్రియల సమయంలో చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణతో పాటు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దైన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గానికి ద్వారకానాథరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994లో ఆయన టీడీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటి నియోజకవర్గంలో విలీనమయ్యాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సైతం టీడీపీలో చేరారు. మంగళవారమే ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. దాడితో పాటు అనకాపల్లి జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు దాడి వీరభద్రరావు. తెలుగుదేశం పార్టీ తరఫున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత జగన్‌పై విమర్శలు కూడా చేశారు. ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తిరిగి 2019 ఎన్నికల ముందు మరోసారి వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లి టికెట్ ఆశించి వైసీపీలో చేరిన దాడికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య సైతం టీడీపీలో చేరారు. ఇప్పటికే చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన రామచంద్రయ్య.. నేడు టీడీపీ కార్యాలయంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ నుంచి మరి కొంత మంది నాయకులు టీడీపీలో చేరబోతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.