ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్-టీపీ అధ్యక్షురాలు, సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వార్త సంచలనంగా మారింది. తాజాగా, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇరువురూ కడప విమానాశ్రయంలో ఫోటోలు దిగినట్లు సమాచారం. విజయవాడకు వస్తుండగా కడప ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది.
ఒకే విమానంలో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ గన్నవరం చేరుకున్నారు. అంతకు ముందు కడప విమానాశ్రయంలో ఇరువురు మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహం కోసం సోదరుడు జగన్‌ను ఆహ్వానించడానికి వైఎస్ షర్మిల కుటుంబసమేతంగా విజయవాడకు వచ్చారు. బుధవారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద షర్మిల.. తన కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ నుంచి కడప విమానాశ్రయానికి చేరకుని.. విజయవాడకు బయలుదేరారు.
ఏది ఏమైనప్పటికీ బ్రదర్ అనిల్ కుమార్, బీటెక్ రవిలు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో చేరాలని వై.ఎస్. షర్మిలకు మల్లికార్జున ఖర్గే నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆమె మంగళవారం తన అనుచరులతో చర్చించిన తర్వాత.. జనవరి 4న పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను పంపే ప్రతిపాదనను ఆ పార్టీ నాయకత్వం చేసిందని ప్రచారం సాగుతోంది. మరోవైపు, పలువురు అభ్యర్థులను మార్చాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీటు దక్కని అసంతృప్తులు వై.ఎస్. షర్మిల వెంట నడిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాను షర్మిల వెంటన నడుస్తానని ప్రకటించారు.
విజయవాడకు వచ్చిన షర్మిల, ఆమె కుటుంబసభ్యులకు స్వాగతం పలకడానికి ఆళ్ల.. గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తాను చేరతానని, కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బలంగా ఉన్నటువంటి పార్టీ అని, బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వ్యక్తుల గురించి అధిష్టానం చూసుకుంటుందని,వారితో చర్చలన్నీ పార్టీనే జరుపుతోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.