జనవరి 22 వ తేదీ భారత దేశ చరిత్రలో, కోట్లాది మంది హిందువుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది. దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు కలగంటున్న అయోధ్యలో రామ మందిర ఏర్పాటు ఆ రోజుతో పూర్తి కానుంది. అయోధ్యలో అత్యంత సుందరంగా నిర్మించిన రామ మందిరంలో రామ్ లల్లాను ప్రతిష్ఠించనున్నారు. హిందూ సంఘాలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కనుంది. ఎంతో మంది హిందువులు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కళ్లారా చూడాలని వేచి చూస్తున్నారు. ఇక దశాబ్దాలుగా రామ మందిర నిర్మాణం కోసం పోరాడుతున్న ఎంతో మంది కరసేవకులు తమ పోరాటం ఫలించిందని సంతోష పడుతున్నారు. ఈ జాబితాలోనే ఒకప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాడిన నరేంద్ర మోదీ.. ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్నారు. అయితే 32 ఏళ్ల క్రితం ఆయన చేసిన ప్రతిజ్ఞ.. రామ మందిరంలో రాముడి ప్రతిష్ఠతో తీరనుంది.
ఈ క్రమంలోనే 32 ఏళ్ల క్రితం రామాలయం కోసం నరేంద్ర మోదీ చేసిన ప్రతిన.. కన్న కల ప్రస్తుతం సాకారం కానుండటం విశేషం. బతికి ఉన్నపుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యం అవుతుందా అని ఎదురు చూసిన కోట్లాది మంది హిందువులు ఇప్పుడు ఆ మధుర క్షణాల కోసం వేచి చూస్తున్నారు. 1992 జనవరి 14 వ తేదీన అయోధ్యలో నరేంద్ర మోదీ రామ ప్రతిన చేశారు. సరిగ్గా 32 ఏళ్లకు అంటే 2024 జనవరిలో ఆ ప్రతిన నెరవేరనుంది. శతాబ్దాల క్రితం అయోధ్యలో కొలువైన రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ బాబ్రీ మసీదు కట్టారని చరిత్ర చెబుతోంది. దీంతో 1992 లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరసేవకులు యాత్రగా బయల్దేరి అయోధ్యకు చేరుకుని బాబ్రీ మసీదు కూల్చివేశారు. అప్పటి నుంచి ఈ స్థలం మరింత వివాదంలోకి మారింది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు 1990 లోనే రామాలయ ఉద్యమాన్ని తీవ్రం చేశాయి. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సారథ్యంలో సోమ్‌నాథ్ నుంచి చేపట్టిన రథయాత్రకు ప్రధాన సమన్వయకర్త గా నరేంద్ర మోదీ వ్యవహరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులను ఏకం చేసేందుకు 1991 డిసెంబర్ 11 వ తేదీన కన్యాకుమారి నుంచి అయోధ్య వరకు బీజేపీ ఐక్యతా యాత్ర చేపట్టింది. 1992 జనవరి నాటికి ఈ ఐక్యతా యాత్ర అయోధ్యకు చేరుకుంది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, సంఘ్ మాజీ ప్రచారకర్త, గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోదీ కూడా యాత్రలో పాల్గొన్నారు. వారంతా అయోధ్యలో ఒక టెంట్ కింద ఉన్న రామ్ లల్లాను దర్శించుకున్నారు. అయితే ఆరోజే నరేంద్ర మోదీ ఒక ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించి.. టెంట్‌లో ఉన్న రామ్ లల్లాను తీసుకెళ్లి కొత్తగా కట్టిన ఆలయంలోకి తీసుకెళ్తామని నరేంద్ర మోదీ ప్రతిన చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు. ఇక 2019 లో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రామమందిర నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి. శరవేగంగా అయోధ్య నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22 వ తేదీన ప్రారంభోత్సవం జరగనుంది. దీంతో నరేంద్ర మోదీ 32 ఏళ్ల ప్రతిజ్ఞ నెరవేరిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.