కృష్ణా జిల్లా అవనిగడ్డలో మెగా డీఎస్సీని ప్రకటించేందుకు వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారు. బస్టాండ్ సెంటర్లో పెద్దఎత్తున ఆందోళనకు దిగి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించకుంటే తాడేపల్లి పాలెంను ముట్టడిస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు... నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు అని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని వాహనాల్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా, డీఎస్సీ అభ్యర్థుల నిరసనకు తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు తెలిపారు.