అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుండగా.. యావత్తు దేశం ఆ మధుర ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కాగా, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను చూసేందుకు వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.
ప్రత్యేకంగా తయారుచేయించిన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపుతున్నట్టు ఈవో వెల్లడించారు. ఈ ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని ఆయన చెప్పారు. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు ఉండగా.. అయోధ్య కోసం 25 గ్రాముల ఉండే లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిచనున్నట్టు తెలిపారు. కాగా, సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ఈవో తెలియజేశారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం 6.47 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, 2.25 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్టు తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని, ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులను వినియోగిస్తున్నామని చెప్పారు. టీ స్టాళ్ల యజమానులతో చర్చించి మట్టి కప్పులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామని ఈవో పేర్కొన్నారు.