విజయవాడ టీడీపీలో రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లేదంటూ ఎంపీ కేశినేని నాని పోస్ట్ చర్చనీయాంశమైంది. అయితే ఎంపీ నాని మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తాను ఏం చెప్పాలనుకున్నది ఫేస్‌బుక్ పోస్ట్‌లో సవివరంగా చెప్పానని.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసావహిస్తానంటూ అతన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌లో స్పష్టంగా చెప్పానన్నారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని నాని కామెంట్ చేశారు. గొడవలు పడటం తన నైజం కాదని.. అంతమాత్రాన అది చేతకానితనం కాదన్నారు. తిరువూరు సభ గొడవ లేకుండా జరగాలనే దూరంగా ఉండాలనుకున్నానని.. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రశాంతంగా సాగాలనే తాను దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మీడియాకు కావాల్సింది మసాలెనేగా అంటూ చురకలంటించారు నాని. తినబోతూ రుచులెందుకు.. అన్ని విషయాలు ఒకే రోజెందుకు.. ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు.. రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు అని కామెంట్ చేశారు.
అది ఎవరికి ఎలా అర్ధమైతే అలా ఇచ్చుకోవాలని.. మీడియాను పట్టించుకోవటం తాను ఎప్పుడో మానేశనన్నారు. గతంలో రేవంత్ రెడ్డి దొంగా అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసిందని.. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నారన్నారు. 2024 మే వరకూ తానే విజయవాడ ఎంపీనని.. తానే చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో తాను నిర్ణయం తీసుకుంటానని.. ఇండిపెండెంట్‌గా పోటీచేసినా తాను గెలుస్తానని గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లడం అనేది ఖాయమని.. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి.. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోయితే ప్రైవేట్ జెట్‌లో వెళ్ళాలి కదా అన్నారు. అంటే ఎంపీ నాని పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. తాను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదని.. పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిన్నారు. విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తానని చెబుతున్నారు. పదేళ్లుగా విజయవాడకు ఎంతో అభివృద్ధి చేశారు అటువంటి తాను ఖాళీగా ఉంటే అభిమానులు కార్యకర్తలు ఊరుకుంటారా అన్నారు.
మరోవైపు కేశినేని చిన్ని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే తన ధ్యేయమన్నారు. టీడీపీలో తాను సామాన్య కార్యకర్తను మాత్రమేనని.. తిరువూరు సభను విజయవంతం చేయడమే తన లక్ష్యమన్నారు. ఆ సభకు లక్ష మందికి పైగా వస్తారని.. కుటుంబంలో చిన్నపాటి కలహాలు సహజమే అన్నారు. తిరువూరులో జరిగిన ఘటన కూడా అటువంటిదేనన్నారు.. ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్ పోస్టుతో తనకు సంబంధం లేదన్నారు. ఇతర పార్టీలో జరుగుతున్న విభేదాలు.. గొడవలు కంటే తమ పార్టీలో వచ్చినవి చాలా చిన్నవని వ్యాఖ్యానించారు.