తిరుమల శ్రీవారికి మరోసారి కాసుల వర్షం కురుస్తోంది.. డిసెంబర్‌లో కూడా భారీగా ఆదాయం సమకూరింది. గత (డిసెంబర్ 2023) నెలలో శ్రీవారిని 19.16 లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ. 116.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. డిసెంబర్‌లో ఒక కోటి 46 వేల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. గత నెలలో 40.77 లక్షలమంది భక్తులు తిరుమలలో శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించారు. కల్యాణకట్టలో 6.87 లక్షలమంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా తిరుమల శ్రీవారి ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటున్న సంగతి తెలిసిందే.
శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను సాయంత్రం కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు జనవరి 20వ తేదీ వరకు పెంచడమైనది. ఏడాది కాలం శిక్షణ కలిగిన సర్టిఫికేట్ కోర్సులైన “సంప్రదాయ కళంకారి కళ” మరియు “శిల్పకళలలో ప్రాథమిక అంశాలు” అనే కోర్సులు నూతనంగా ప్రవేశ పెట్టారు. కళాశాలలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి 20వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది. కోర్సులో ప్రవేశం పొందేందుకు 10 వ తరగతి పాసై ఉండాలి. వీరికి గరిష్ట వయో పరిమితి లేదు. ఇతర వివరాల కోసం ప్రిన్సిపాల్, ఎస్వీ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ కళాశాల, అలిపిరి రోడ్, బాలాజీ లింక్ బస్టాండ్ పక్కన, తిరుపతిలో గానీ, 0877-2264637, మొబైల్ నెం.9866997290 నంబర్లను గానీ సంప్రదించగలరు.