తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు భారీ విరాళాలను అందజేశారు.టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ.40 లక్షలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాదుకు చెందిన కేవీ రాజశేఖర్‌కు చెందిన జేకేసీ ప్రాజెక్ట్సు లిమిటెడ్ సంస్థ.. ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు, కొల్లి గోపాలకృష్ణ.. అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, కొల్లి మాధవ.. అన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఢిల్లీకి చెందిన శివంగ్.. కౌర్ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధులు వీ మణిరెడ్డి, తిరుపతికి చెందిన వై రాఘవేంద్ర కలిసి విరాళం డీడీలను తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 59,522మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.51 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అలాగే 18,544మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉండగా.. సర్వ దర్శనం (టోకెన్లు లేని) భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. గురువారం కాస్త రద్దీ తక్కువగా కనిపించినా.. శుక్రవారం మాత్రం పెరిగిపోయింది.
జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా జనవరి 5న శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామివారు రామచంద్రకట్టపైకి వేంచేపు చేస్తారు. ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్వామివారు ముందుగా ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపడతారు. ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.