వైఎస్ఆర్సీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ నన్ను నమ్మించి గొంతు కోశారని, నాకు టికెట్ లేదని బయటకు పంపించారని ధ్వజమెత్తారు. జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. తనకు అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. తాను, తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులు కొని వచ్చానని అన్నారు. గతంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సర్వే పేరుతో టికెట్ లేదని, దరిద్రపు సర్వేలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఇప్పటి వరకు ఎదురు చూశానని, సజ్జల వచ్చి టికెట్ లేదని చెప్పారని అన్నారు. ఇంత కంటే అవమానం మరొకటి లేదని ఎమ్మెల్యే కాపు వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో అవకాశం వచ్చిన పోటీ చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ తనయుడు నమ్మించి గొంతు కొస్తారని అనుకోలేదని, జగన్ కి గుడ్ బై.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.
కాగా, శుక్రవారం ఉదయం కాపు రామచంద్రారెడ్డి తన భార్య, కుమారుడుతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి ఆయన ప్రయత్నించారు. కానీ, ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం దక్కలేదని కాపు రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన పరిణామాలతో జగన్ వెంట నడించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2019 ఎన్నికల్లో గెలుపొందారు.