విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ములగాడ విజయలక్ష్మి వెండి త్రిశూలాన్ని అందజేశారు. కిలో బరువు ఉన్న వెండి త్రిశూలాన్ని శుక్రవారం ఆలయంలో బహూకరించారు. సినీ నటి కరాటే కల్యాణితో కలిసి దాత కుటుంబం త్రిశూలాన్ని దేవస్థానం ఈవో రామారావుకు అప్పగించారు. దేవస్థానం అధికారులు దాత కుటుంబానికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం చేశారు. దేవస్థానం అధికారులు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆలయ చరిత్రలో తొలిసారిగా మూడు నెలలకు రూ.1.03 కోట్ల ఆదాయం నమోదైంది. 97 రోజులకు గాను భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల్ని లెక్కించగా రూ.1,03,83,725 డబ్బులు ఉన్నాయి. బంగారం 90 గ్రాములు, వెండి 4.700 కిలోలు, అమెరికా డాలర్లు 219, అరబ్ దీనార్స్ 10, సింగపూర్ డాలర్లు 14, ఆస్ట్రేలియా డాలర్లు 10, ఇంగ్లాండ్ పౌండ్స్ 15 ఆదాయంగా వచ్చినట్లు తెలిపారు.