అయోధ్యలో జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత క్షణాల కోసం యావత్ భారత దేశమే కాకుండా విదేశాల్లోని హిందువులు కూడా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని గర్భిణీలు కొత్త ఆశతో ఉన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజే తాము ప్రసవించాలని భావిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లి.. తమకు జనవరి 22 వ తేదీనే ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయాలని కోరుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆస్పత్రుల్లో ఉన్న డాక్టర్లకు.. పేషంట్ల నుంచి కొత్త రకమైన వినతులు వస్తున్నాయి. తమకు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు నిర్వహించి.. తమ బిడ్డలకు జన్మనిచ్చేలా చూడాలని కోరుకుంటున్నారు. అందుకోసం సీ సెక్షన్ ఆపరేషన్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారు తమ డెలివరీ తేదీని జనవరి 22 వ తేదీ వరకు ఆపాలని విన్నవిస్తున్నారు. ఇక జనవరి 22 వ తేదీ వరకు నెలలు పూర్తిగా నిండని వారు కూడా కొంత ముందస్తుగానే.. జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయాలని వేడుకుంటున్నారు. దీంతోపాటు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజు పుట్టే తమ పిల్లలకు రాముడి పేరు వచ్చేలా పేర్లు పెట్టాలని ఉత్తర్‌ప్రదేశ్‌లోని తల్లులు కోరుకుంటున్నారు. అయోధ్యలో రాముడు కొలువుతీరనున్న సమయం అత్యంత శుభ సమయమని.. ఆరోజు ఎంతో పవిత్రమైందని అక్కడి వారు భావిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇలాంటి అభ్యర్థనలు పెరుగుతున్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆస్పత్రుల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి.
ఇక జనవరి 22 వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 7 వేల మంది అతిథులకు ఆహ్వానాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పంపించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు.. సాధువులు, స్వామీజీలు వేడుకలకు హాజరుకానున్నారు. మరోవైపు.. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 22 వ తేదీన ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాలతో ముగుస్తుంది.