మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. రాజధాని భోపాల్‌లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బాలికల వసతి గృహాన్ని నడుపుతున్నారు. అయితే ఆ వసతి గృహంలో నివసించే వారిలో 26 మంది బాలికలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. వివిధ రాష్ట్రాలకు చెందిన బాలికలు ఆ వసతి గృహంలో ఆశ్రయం పొందుతుండగా.. వారు కనిపించకుండా పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ బాలికలు వారంతట వారే వెళ్లారా.. లేక మానవ అక్రమ రవాణా ముఠాలు కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తరలించారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భోపాల్ శివారులోని పర్వాలియా ఆంచల్ బాలికల హాస్టల్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో ఆకస్మికంగా పరిశీలించారు. అయితే ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికల హాస్టల్ రిజిస్టర్‌ను పరిశీలించిన అధికారులకు సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందులో ఉండే 26 మంది బాలికలు అదృశ్యమైనట్లు గుర్తించారు. అందులో మొత్తం 68 బాలికల పేర్లు ఎంట్రీ రిజిస్టర్‌లో ఉండగా.. 42 మంది బాలికలు మాత్రమే అక్కడ ఉండగా.. మిగిలిన 26 మంది కనిపించలేదని గుర్తించారు. కనిపించకుండా పోయిన బాలికల్లో కొందరు గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. మరికొందరు బాలికలు మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్‌కు చెందిన వారిగా గుర్తించారు.
అయితే బాలికల అదృశ్యం గురించి చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను అధికారులు ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నలకు అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికల హాస్టల్ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దర్యాప్తులో హాస్టల్‌లో అనేక అవకతవకలు జరిగినట్లు బయట పడింది. ఆ వసతి గృహం కూడా అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది.
ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో సోషల్ మీడియాలో స్పందించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మిషనరీ నిర్వహిస్తున్న అక్రమ బాలల గృహాన్ని రాష్ట్ర బాలల కమిషన్ చైర్మన్‌తో కలిసి సంయుక్తంగా తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా బాలికల హాస్టల్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ బాలికల వసతి గృహంలో 6 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల 40 మందికి పైగా బాలికలు ఉన్నట్లు చెప్పారు.