అయోధ్యలో రాముడు కొలువుదీరే ఘట్టం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో జరగనున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సాధువులు, ఋషులు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు, సినిమా సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఆహ్వాన పత్రికలు అందించింది. అయితే ఆ రోజు అయోధ్యకు భక్తులు ఎవరూ రావద్దని.. కేవలం ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని ప్రధాని నరేంద్ర మోదీతోపాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా విజ్ఞప్తి చేసింది. ఇళ్లలోనే ఉండి రామ జ్యోతి వెలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
అయితే అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని జైళ్లలో ఉన్న ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలు కూడా అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22 వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలో ఉన్న ఖైదీల కోసం ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని నగరాలు, గ్రామాల్లో ఊరేగింపులు జరుగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భజన, కీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్ అంతటా నిరంతరం రామ్ చరిత్ మానస్ పారాయణం జరుగుతోంది.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించడంతో దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ జైళ్లు, హోం గార్డుల సహాయ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి తెలిపారు. ఈ మేరకు అయోధ్యలో జరిగే రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రంలోని జైలు సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. జైళ్లలో గాయత్రీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం పఠించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో జైలులో ఉన్న ఖైదీలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హనుమాన్ చాలీసా, సుందరకాండ పుస్తకాలను అందజేస్తోంది. దీంతో పుస్తకాలు కావాలంటూ ఖైదీల నుంచి డిమాండ్ పెరిగిందని ధరమ్‌వీర్ ప్రజాపతి వెల్లడించారు. దీంతో గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతా ప్రెస్ నుంచి సుందరకాండ, హనుమాన్ చాలీసా పుస్తకాలను 50 వేల కాపీలు ఆర్డర్ చేసినట్టు మంత్రి వివరించారు. వాటిని త్వరలోనే యూపీలోని అన్ని జైళ్లలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
మరోవైపు.. ఇటీవలె అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి అధికారులతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 14 నుంచి మార్చి 24 వరకు అయోధ్యలోని అన్ని దేవాలయాల్లో రామాయణం, భజన కీర్తనలు, రామచరిత్ మానస్‌తో పాటు సుందరకాండ పఠనం కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22 వ తేదీ వరకు అన్ని బస్సుల్లో రామ్ భజన చేసేలా ఏర్పాట్లు చేసింది.