ఓ గ్యాంగ్ స్టర్ ఆస్తులు సీజ్ చేస్తున్న క్రమంలో బయటపడిన ఓ విషయం ఢిల్లీ పోలీసులను విస్మయానికి గురి చేస్తోంది. ఆ గ్యాంగ్ స్టర్ తన ప్రియురాలికి ఏకంగా రూ. వంద కోట్ల భవనాన్ని బహుమతిగా ఇచ్చాడు. గ్యాంగ్‌స్టర్ రవి కన్హా అలియాస్ రవీంద్ర నగర్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో గ్రేటర్ నోయిడా పోలీసులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే కాజల్ ఝా అనే మహిళ ఉంటున్న ఇంటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఇంటి విలువ రూ.100 కోట్లు అని.. దాన్ని రవి కనా.. కాజల్ ఝాకు ఇచ్చినట్లు గుర్తించారు.
ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉంటున్న కాజల్ ఝా.. గ్యాంగ్‌స్టర్ రవి కనా ప్రియురాలిగా విచారణలో పోలీసులు గుర్తించారు.
రవి కనా గ్యాంగ్ స్టర్ గురించి తెలుసుకున్న పోలీసులు.. అతను రవీంద్ర నగర్ అనే కాలనీలో 16 మంది సభ్యులతో స్క్రాప్ మెటీరియల్‌ను సేకరించి అక్రమంగా విక్రయించి.. ఆ డబ్బుతో ఢిల్లీలో బిల్డింగ్ కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే కొన్నేళ్లకు రవి కనాకు కాజల్ ఝా పరిచయం ఏర్పడిందని తెలిపారు. తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నానని రవి కనాకు చెప్పగా అతను చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. ఆ తర్వాత రవి కనాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కాజల్ ఝానే చూసుకునేదని తేలింది.
ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించిందని గుర్తించారు. ఈ క్రమంలోనే దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో దాదాపు రూ.100 కోట్ల విలువైన 3 అంతస్థుల భవనాన్ని కొనుగోలు చేసిన రవి కనా.. కాజల్ ఝాకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్క్రాప్ మాఫియాను పట్టుకునే క్రమంలో పోలీసులు ఆమె నివసిస్తున్న బిల్డింగ్‌పై బుధవారం దాడులు నిర్వహించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసుల నుంచి కాజల్ ఝా, స్క్రాప్ మాఫియా తప్పించుకుందని.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
స్క్రాప్ అక్రమ రవాణా చేస్తూ రూ. కోట్లు సంపాదించిన రవి కనా.. ప్రియురాలి కోసం అత్యంత ఖరీదైన బిల్డింగ్‌ను కానుకగా ఇచ్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రవి కనాపై ఇప్పటికే 11 కేసులు ఉండగా.. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించిన స్క్రాప్ గోడౌన్లపై దాడులు చేసి తాళాలు వేశారు. గ్యాంగ్ స్టర్ రవి కనా అతని ప్రియురాలు కాజల్ ఝా, ఇతర ముఠా సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.