సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి.. సుప్రీం కోర్టులో చేసిన పనికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అవాక్కయ్యారు. ఎందుకంటే ముకుల్ రోహత్గి.. సుప్రీం కోర్టులోకి రెండు మద్యం సీసాలను తీసుకువచ్చి నేరుగా సీజేఐ ముందే ఉంచారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌గా పని చేసిన ముకుల్ రోహత్గి దేశంలోనే టాప్ సీనియర్ లాయర్లలో ఒకరు కావడం గమనార్హం. అయితే అలాంటి వ్యక్తి సుప్రీం కోర్టులోకి మందు బాటిళ్లు పట్టుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఓ కేసు విచారణలో భాగంగానే ఆయన మద్యం బాటిళ్లు తీసుకురావడం విశేషం. అసలేం జరిగిందంటే?
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణకు సంబంధించి సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి శుక్రవారం వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే 2 విస్కీ బాటిళ్లను అక్కడ ప్రవేశపెట్టడంతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ షాక్ అయ్యారు. పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, జేకే ఎంటర్ ప్రైజెస్ మధ్య కొనసాగుతున్న ట్రేడ్ మార్క్ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై దాఖలైన అప్పీలు పిటిషన్ విచారణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ అప్పీలును దాఖలు చేసిన పెర్నోడ్ రికార్డ్ కంపెనీ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
ఇక లండన్ ప్రైడ్ పేరుతో మద్యాన్ని తయారు చేయకుండా జేకే ఎంటర్ ప్రైజెస్‌కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును పెర్నోడ్ రికార్డ్ కంపెనీ తరఫున ముకుల్ రోహత్గి కోరారు. ఈ అప్పీలుపై విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. మద్యం ఉత్పత్తులను కోర్టులోకి తీసుకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీజేఐకి విన్నవించారు. దానికి సీజేఐ అంగీకరించడంతో.. 2 విస్కీ బాటిళ్లను తీసుకువచ్చి సుప్రీం కోర్టు న్యాయవాదుల ముందు ఉంచారు.
అయితే ఆ రెండు విస్కీ బాటిళ్లను చూసిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మీరు మీతో పాటు మందు సీసాలను కూడా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. దానికి సమాధానం ఇచ్చిన ముకుల్ రోహత్గి.. ఈ రెండు కంపెనీలు తయారు చేసిన మద్యం బాటిళ్ల మధ్య భేదాలను చూపించేందుకు తీసుకు వచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా ఆ మద్యం తయారీలో ట్రేడ్‌మార్క్ చట్టాల ఉల్లంఘన ఏ విధంగా జరిగిందో సుప్రీంకోర్టుకు ముకుల్ రోహత్గి వివరించారు. దీంతో వాదనలు విన్న సుప్రీం కోర్టు.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపింది. ఈ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తోపాటు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు.