ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానం గాల్లో ఉండగానే భారీ శబ్దంతో ఊడిపోయిన డోర్

international |  Suryaa Desk  | Published : Sat, Jan 06, 2024, 10:32 PM

విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయి... 16 వేలకుపైగా అడుగుల ఎత్తులోకి చేరిన తర్వాత విమానం డోరు భారీ శబ్దంతో ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 20 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. చివరకు విమానాన్ని సురక్షితంగా బయలుదేరిన విమానాశ్రయంలో దింపడంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. పోర్ట్‌లాండ్ నుంచి అంటారియోకు బయలుదేరిన అలస్కా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 ఏఎస్1282 విమానం పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే డోర్ తెరుచుకోవడంతో అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. క్యాబిన్ మధ్యలో ఉన్న తలుపు పూర్తిగా విమానం నుంచి విడిపోయినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ‘పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియో (కాలిఫోర్నియా)కి AS1282 బయలుదేరిన వెంటనే ఈ సాయంత్రం ఒక సంఘటనను ఎదుర్కొంది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో విమానం పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా తిరిగి వచ్చింది. ఏమి జరిగిందో మేము పరిశీలిస్తున్నాం.. కారణం తెలిసిన తర్వాత మరిన్నింటిని భాగస్వామ్యం చేస్తాం’ అని అలస్కా ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది.


ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు ట్విట్టర్‌లో వెల్లడించింది. టేకాఫ్ అయిన తర్వాత విమానం 16,325 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత తిరిగి పోర్ట్‌లాండ్ విమానాశ్రయానికి వచ్చిందని ఫ్లైట్‌రాడార్24 తెలిపింది. కాగా, ఘటన చోటుచేసుకున్న బోయింగ్ 737 MAX విమానాన్ని అక్టోబరు 1, 2023న అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ చేయగా.. నవంబర్ 11న వాణిజ్య సేవలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఇది కేవలం 145 సర్వీసులను పూర్తిచేసిందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com