ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలీవర్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా చనిపోయినట్టు అధికారులు తెలిపారు. క్రిస్టయన్ ఒలీవర్ ప్రయాణిస్తున్న విమానం కరేబియన్ సముద్రంలో కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఒలీవర్.. జార్జ్ క్లూనీతో కలిసి ‘ది గుడ్ జర్మన్’, 2008లో యాక్షన్-కామెడీ ‘స్పీడ్ రేసర్’లో నటించారు. గురువారం తన సొంత విమానంలో క్రిస్టియన్ ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందన రాయల్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ పోలీస్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపాయి.
విమానం కూలిపోయిన విషయాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు, కోస్ట్‌గార్డులు, డైవర్లు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. ఘటనా స్థలిలో నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒలీవర్ (51), ఆయన కుమార్తెలు మాదిత (10), అన్నిక్ (12), విమాన యజమాని & పైలట్ రాబర్ట్ సాచ్ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. విమానం కుప్పకూలుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో ఏదో సమస్య తలెత్తిందని, ల్యాండింగ్ కోసం తిరిగి వస్తున్నామని పైలట్ సందేశం పంపించాడు. ఆ కాసేపటికే అది కుప్పకూలింది. సముద్రంలో కూలుతుండగా.. తీరం నుంచి కొంత మంది పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియోలో వారి అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఒలీవర్ ప్రస్తుతం ఫరెవర్ హోల్డ్ యువర్ పీస్ సినిమాలో నటిస్తుండటం యాదృశ్చికం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ అభిమానులు, సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.
స్వర్గం నుంచి శుభాకాంక్షలు!
ప్రమాదానికి గురైన విమానం గురువారం మధ్యాహ్నం తర్వాత గ్రెనడైన్స్‌లోని చిన్న ద్వీపం బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. ఒలీవర్ కుటుంబం వెకేషన్‌లో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒలివర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల కిందట అక్కడ బీచ్‌లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘స్వర్గం నుంచి శుభాకాంక్షలు.. 2024లో మేం ఇక్కడకు వచ్చాం’ అని పోస్టు చేశారు. ఇప్పుడీ పోస్టు వైరల్ అవుతోంది. క్రిస్టియన్ ఒలీవర్ అసలు పేరు క్రిస్టియన్ క్లెప్సర్. టామ్ క్రూజ్ చిత్రం ‘వాల్కైరీ’సహా 60కి పైగా సినిమాలు, టెలివిజన్ షోలు, సీరియల్స్‌లో నటించాడు. కెరీర్ తొలినాళ్లలో ‘సేవ్డ్ బై ది బెల్.. ది న్యూ క్లాస్’ ‘ది బేబీ-సిట్టర్ క్లబ్’ వంటి టీవీ సీరియల్స్ లో పనిచేశాడు. తన మాతృభాష జర్మన్‌లో ‘అలారమ్ ఫర్ కోబ్రా 11’ అనే పాపులర్ షో రెండు సీజన్లలో పోలీస్ అధికారిగా కనిపించి మెప్పించాడు.