మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ 5 రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. తన సతీమణి సాజీదా మహ్మద్‌తో కలిసి ఆయన చైనాకు వెళ్లారు. అయితే గత ఏడాది నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి మహ్మద్ మొయిజ్జూ విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే మహ్మద్ మొయిజ్జూ చైనా మద్దతుగా వ్యవహరిస్తారని అక్కడ అందరికీ తెలిసిందే. ఇక మాల్దీవులు ఎన్నికల సమయంలో కూడా ఇండియా ఔట్ అనే నినాదాన్ని మహ్మద్ మొయిజ్జూ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఇండియా ఫస్ట్ అంటూ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలేహ్ నినాదాలు ఇచ్చారు. అయితే చివరికి మహ్మద్ మొయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత వ్యతిరేక చర్యలకు దిగుతూనే ఉన్నారు. మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలు తిరిగి వెళ్లిపోవాలని సూచించారు.
అయితే ఇటీవల లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడంపై మాల్దీవులకు చెందిన మంత్రులు, ఇతర నేతలు, అధికారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో భారత్ నుంచి కూడా గట్టి కౌంటర్ ఆ దేశానికి ఎదురైంది. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ భారత్‌కు చెందిన నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా పిలుపునివ్వడంతో మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. చాలా మంది తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన మాల్దీవులు ప్రభుత్వం.. నష్ట నివారణ చర్యల్లో భాగంగా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అయినా ఈ వివాదం ముగిసిపోలేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ చైనా పర్యటనకు వెళ్లడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి మహ్మద్ మొయిజ్జూ, ఆయన భార్య సాజీదా మహ్మద్‌తో కలిసి చైనాకు వెళ్లారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకే మాల్దీవుల అధ్యక్షుడు 5 రోజుల పాటు అక్కడ అధికారిక పర్యటన చేయనున్నట్లు మాల్దీవులు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే భారత్ అంటే గిట్టని చైనా.. తన సొంత ప్రయోజనాల కోసం మాల్దీవులను పావుగా వాడుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే భారత్, మాల్దీవుల మధ్య ఇప్పటివరకు ఉన్న సన్నిహిత సంబంధాలపై నీలినీడలు కమ్ముకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మహ్మద్ మొయిజ్జూకు ఇదే మొదటి విదేశీ పర్యటన కావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా మహ్మద్ మొయిజ్జూ, షీ జిన్‌పింగ్ భేటీ అయి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. వివిధ రంగాల్లో చైనా, మాల్దీవుల సహకారం కోసం సంతకాలు చేయనున్నారు.