ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరిగిన సందర్భమే లేదని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ బృందాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలు కమిషన్‌కు వివరించామన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని, ఆధారాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారని, టీడీపీ - జనసేనపై 7 వేల అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే పరిస్థితి నెలకొందని, చరిత్రలో ఎక్కడా జరగని అక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎవ్వరినీ వదిలిపెట్టమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని, అవసరమైతే అక్రమాలపై కోర్టుకు కూడా వెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయ వాలంటీర్స్‌తో ఎన్నికలు నడపాలని వైసీపీ చూస్తోందన్నారు. తెలంగాణలో ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. అయితే ఎన్నికల విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కామని ఎలక్షన్ కమీషన్ మాట ఇచ్చిందన్నారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తామిచ్చిన ఫిర్యాదులపై కొన్ని చర్యలు తీసుకున్నామని కమిటీ చెప్పిందన్నారు.