ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌ వైపు పర్యాటకుల చూపు.. ఆన్‌లైన్‌లో 3400 శాతం పెరిగిన సెర్చ్‌లు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 09:31 PM

మన ప్రధాని నరేంద్ర మోదీ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏది చేసినా అది దేశ ప్రజలను ఆకర్షిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. అందులో భాగంగానే అక్కడి బీచ్‌లు, సముద్రం వద్ద దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పర్యాటకాన్ని ఆస్వాదించేవారు లక్షద్వీప్‌ను తమ జాబితాలో చేర్చుకోవాలని సూచించారు. దీంతో సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే వారి సంఖ్య అమాంతం పెరిగింది. అక్కడి ప్రదేశాలు, బీచ్‌లు, లక్షద్వీప్ అందాల కోసం నెటిజన్లు ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్ టూర్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేవారి సంఖ్య 3400 శాతం పెరిగిందని తెలిపింది.


ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని ఆన్‌లైన్ ట్రావెలింగ్ కంపెనీ మేక్‌ మై ట్రిప్ వెల్లడించింది. లక్షద్వీప్‌ టూర్‌ కోసం తమ ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఆ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ కాగా.. వాటిపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. చెలరేగిన వివాదంతో లక్షద్వీప్ గురించి వెతికే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయినట్లు మేక్ మై ట్రిప్ సంస్థ పేర్కొంది. అయితే బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ భారత్‌లోని సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు లక్షద్వీప్ వైపు మొగ్గుచూపుతూ కామెంట్లు చేస్తున్నారు.


మరోవైపు.. భారత్ - మాల్దీవుల మధ్య చెలరేగిన వివాదం కారణంగా మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారత ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ ఇప్పటికే ప్రకటించింది. భారత్‌పై మాల్దీవులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈజ్ మై ట్రిప్ ఫౌండర్ నిశాంత్ పిట్టి ట్వీట్‌ చేశారు. ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. లక్షద్వీప్‌ను పర్యాటకానికి స్వర్గధామంగా మార్చాలని పిలుపునిచ్చారు. మోదీ షేర్ చేసిన వీడియో, ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. అక్కడే అసలు వివాదానికి అగ్గి రాజేసినట్లయింది. మాల్దీవుల మంత్రి షియునా ప్రధాని మోదీపై వ్యంగ్యంగా తీవ్ర స్థాయిలో స్పందించారు. మరో ఇద్దరు మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేయగా.. భారత్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com