లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోషూట్ తర్వాత ఈ దీవుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానికి బీచ్‌లో ఫోటోషూట్ అవసరమా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినవారు, స్టేటస్‌లు పెట్టుకున్న వాళ్లు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రధాని మాత్రం మానవమాత్రుడు కాదా..? ఆయనకు విశ్రాంతి అక్కర్లేదా? అని కౌంటర్ అటాక్‌లు వినిపించాయి. పనిలో పనిగా ప్రధాని మోదీ చేసిన ఫోటోషూట్ మన పర్యాటకాన్ని బూస్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకులు వివరించారు. ఆ అంచనాలు నిజమయ్యాయి. లక్షద్వీప్ గురించి సెర్చ్ చేస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంతలా అంటే.. శుక్రవారం (జనవరి 5) ఒక్క రోజే 50 వేల మంది లక్షద్వీప్ గురించి గూగుల్‌లో వెతికారు. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర ప్రభుత్వ డిజిటల్ విభాగం తెలిపింది.
సాధారణంగా సెలబ్రిటీలు, కాస్త డబ్బులు ఉన్నవారు తరచుగా మాల్దీవుల పర్యటనకు వెళ్తుంటారు. అంతేకాదు, పూర్తిగా పర్యాటకంపైనే ఆధారపడిన మాల్దీవులకు వచ్చే టూరిస్టులలో అత్యధికం భారతీయులే. అయితే, మాల్దీవుల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం చైనా ట్రాప్‌లో పడి, కొంత కాలంగా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ ‘లక్షద్వీప్’ పర్యటనతో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటికే మాల్దీవుల పర్యటన కోసం బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలోలక్షద్వీప్ గురించి సెర్చ్ పెరిగింది.
సుందరమైన బీచ్‌లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం లక్షద్వీప్ ప్రత్యేకత. ఇక్కడి నీలి రంగు సముద్ర జలాలు పర్యాటకులను మరింత ఆకట్టుకుంటాయి. అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ అనేది 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి ‘లక్షద్వీప్’ అనే పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ‘లక్కదివ్’ అని పిలిచేవారు. ఇక్కడ 36 దీవులున్నా.. వాటిలో కేవలం 10 దీవులు మాత్రమే మానవ నివాసయోగ్యంగా ఉన్నాయి. ఇప్పటివరకూ గోవా, ఊటీ, సిమ్లా, మనాలి లాంటి ప్రాంతాలకు తరచూ వెళ్లొచ్చేవారు ఇప్పుడు లక్షద్వీప్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
లక్షద్వీప్ చేరుకోవడం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా.. పర్యటన వర్త్ అనిపిస్తుందని, భూతల స్వర్గంలో అడుగుపెట్టినట్లు ఉంటుందని ఇక్కడికి వెళ్లొచ్చిన వాళ్లు చెబుతున్నారు. మంచి ఆతిథ్యం, ఆహారం లభిస్తుందని అంటున్నారు. లక్షద్వీప్‌కు వెళ్లొందుకు సెప్టెంబర్ నుంచి మార్చి అనువైన సమయం అని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. కొంత మంది మార్చి నుంచి జూన్ మధ్య కూడా వెళ్తుంటారు. కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నా.. ఎక్కువ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కోచి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడ నుంచి విమానం ద్వారా అగట్టి, బంగారం దీవులను చేరుకోవచ్చు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోచి నుంచి లక్షద్వీప్‌కు విమాన సర్వీసులు నడుపుతోంది. లక్షద్వీప్‌లోని అగట్టి ప్రాంతంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంది. అగట్టి నుంచి కవరత్తి, కద్మత్ లాంటి పర్యాటక ప్రాంతాలకు పడవల్లో వెళ్లవచ్చు. అనుమతి లేకుండా లక్షద్వీప్‌కు వెళ్లడం నేరం. లక్షద్వీప్ వెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం లక్షద్వీప్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధిష్ట ధ్రువపత్రాలు సమర్పించి సమర్పించాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి వాటిని వెరిఫై చేయించుకోవాలి. అప్పుడు లక్షద్వీప్ నుంచి అనుమతి పత్రం వస్తుంది. దీనికి ఐడీ ప్రూఫ్‌లు, పాస్‌పోర్టు సైజు ఫోటోలు జతచేసి పర్యటన సమయంలో వెంట తీసుకెళ్లాలి. వాటిని పరిశీలించాకే ఐలాండ్‌లో అడుగుపెట్టేందుకు అక్కడి అధికారులు అనుమతి ఇస్తారు.
లక్షద్వీప్‌లో పర్యటించేందుకు వివిధ టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 3 నుంచి 6 రోజులకు గాను ఈ ప్యాకేజీలు ఉంటాయి. కోచి నుంచి మొదలవుతుంది. అంటే, 3 రోజుల పర్యటన కోసం బుక్ చేసుకుంటే.. ఒక రాత్రి కోచిలో, రెండు రోజులు లక్షద్వీప్‌లో బస కల్పిస్తారు. మూడు రోజుల ప్యాకేజీ రూ. 23,000 (ఒక్కో వ్యక్తికి) నుంచి మొదలవువుతుంది. ఇందులో హోటల్ గదులతో పాటు, సైట్ విజిటింగ్, లోకల్ ట్రాన్స్‌పోర్టు, ఆహారం కల్పిస్తారు. కోచి వరకు చేరుకునేందుకు ఖర్చులను వ్యక్తిగతంగా భరించాలి. టూరిస్టు కేంద్రాల ద్వారా కాకుండా, వ్యక్తిగతంగా వెళితే.. 1, 2 వేల రూపాయలకు మించి తగ్గదని పర్యాటకులు చెబుతున్నారు. అయితే, రిస్క్ ఎక్కువ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.