కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు మన అంధ్రప్రదేశ్ కు వచ్చారు. రాజకీయ పార్టీలను కలిసి వారి ఫిర్యాదులను విని ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పక్షాలతో సమావేశం అయ్యారు. దీనిలో చిత్రంగా శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్షనాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి కొన్ని అంశాలను విన్నవించి.. బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. మేము అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రొత్సహిస్తున్నామని మాట్లాడారు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... విచిత్రంగా ఆయనతో పాటు వైయస్ఆర్‌సీపీని మోసం చేసి, డబ్బు తీసుకుని టీడీపీకి ఓటు వేసిన తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని తీసుకెళ్లారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడానికి మరో దొంగ ఓటరును వెంటబెట్టుకుని వెళ్లడం విడ్డూరం. వైయస్ఆర్‌సీపీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచి..మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అమ్ముడుపోయి..చంద్రబాబు చెప్పినట్లుగా ఓటు వేసిన శ్రీదేవి గారిని వెంటబెట్టుకుని వెళ్లి మాపై ఫిర్యాదు చేస్తున్నాడు. ఈయన ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నట్లు నటిస్తున్నాడు...ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా వెంటబెట్టుకుని వెళితే ఆయన బండారం ఇంకా బయటపడేది. ఈ దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన చంద్రబాబే. ఆయనకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదు. ఆయనకు క్యాష్, కుట్రలు, కుత్రంత్రాలపై మాత్రమే ఆయనకు నమ్మకం. ఇలాంటివి చేసే ఆయన ఎదిగాడు తప్ప ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు కాదు. వెనక్కు వెళ్లి చూస్తే..ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. మనవద్ద జరిగేలా కాస్ట్లీ ఎన్నికలు ఎక్కడా ఉండవు. దీనికి కారణం చంద్రబాబే. ఎన్టీఆర్‌ను దించిన తర్వాత తాను గెలవడం కోసం ఓటర్లను కొనేందుకు విపరీతంగా ఖర్చు పెట్టింది చంద్రబాబే. ఇలాంటి దుర్మార్గుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చంద్రబాబు. అసలు ప్రజాస్వామ్యంపై మాట్లాడటానికి చంద్రబాబుకి బుద్దుందా? తెలంగాణ నుంచి నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావో మర్చిపోయావా బాబూ..? ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొనడానికి ప్రయత్నం చేసి డైరెక్ట్‌గా పట్టుబడటం వల్లే కదా నువ్వు ఏపీ పారిపోయి వచ్చావ్..? అని ప్రశ్నించారు.