తన భవిష్యత్తు సీఎం జగన్ నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. బుధవారం నాడు సీఎం జగన్‌తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు గుడివాడ అమర్నాథ్ వివరించారు. మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. పెందుర్తి, చోడవరం అంటూ ప్రచారాలు మాత్రమేనని అన్నారు. సీఎం జగన్‌కు అమర్నాథ్ అంటే ఎంటో తెలుసునని.. తనకు ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసునని తెలిపారు. తాను పార్టీకి ఎలాంటి సేవ చేయ్యాలో ఆయనకి తెలుసునని పేర్కొన్నారు. ఈ నెలలో కర్నూల్‌లో 2500 కోట్లతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపనపై చర్చించినట్లు తెలిపారు. అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశాడని... ఎవరిని కలిస్తే మాకేంటి..? అని ప్రశ్నించారు. తాను రావడం వల్లే పార్టీకి ఇమేజ్ పెరిగిందని.. అనుకుంటే వారికి పతనం మొదలు అయినట్టేనని తెలిపారు. పార్టీ తర్వాతే ఎవరైనా.. రాయుడు జనసేనలో ఏం చేస్తాడో.. అక్కడ ఎన్ని రోజులు ఉంటారో చూద్దామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.