కోట్లాది మంది హిందువుల కల నెరవేరనున్న వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అత్యద్భుతమైన అవకాశం రానుంది. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహాన్ని స్వయంగా నరేంద్ర మోదీ.. గర్భగుడిలోకి తీసుకురానున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి శ్రీరాముడి విగ్రహాన్ని మోసుకురానున్నారు. 25 సెకన్లలో పూజ మండపం నుంచి అయోధ్య గర్భగుడికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. అయితే ఈ కార్యక్రమం మొత్తం కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో జరగనుంది. ఇక అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వివరించారు. జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ అపూర్వ ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపింది. సుమారు 4 వేల మంది సాధువులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు చెప్పారు.
మరోవైపు ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీన ఉదయం 10 గంటలకు అన్ని ఆలయాల్లో భజనలు చేయాలని కోరారు. ఆలయ కమిటీలు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తి అయి హారతి ఇచ్చిన తర్వాతే అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పేర్కొన్నారు. ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక జనవరి 15 వ తేదీ మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వ తేదీ వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు. మరోవైపు.. అయోధ్యలో భారీగా భక్తుల రద్దీ నెలకొంటుండటంతో జనవరి 17 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. మరోవైపు.. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న 5500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం గుజరాత్ నుంచి సోమవారం అయోధ్యకు చేరుకుంది.