ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ అగ్రస్థానంలో నిలిచాయి. తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఈ ఆరు దేశాల పాస్‌పోర్టుతో ప్రపంచవ్యాప్తంగా 194 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. రెండోస్థానంలో ఫిన్‌లాండ్, సౌత్ కొరియా, స్వీడన్ ఉన్నాయి. మూడో స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్స్, నెదర్లాండ్స్ దేశాలున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ దగ్గర్నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను రూపొందించారు.
80వ స్థానంలో నిలిచిన భారత పాస్‌పోర్టుతో 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. భారతీయులు పాస్‌పోర్ట్ ఉంటే చాలు వీసా అవసరం లేకుండానే మన పొరుగున ఉన్న నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు లాంటి దేశాలతోపాటు థాయ్‌లాండ్, మలేసియా లాంటి దేశాలకు వెళ్లొచ్చు. మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో 2017లో 87వ స్థానంలో ఉన్న భారత్.. 2018లో 81, 2019, 2020ల్లో 82, 2021లో 81వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు 2006లో 71వ ర్యాంకులో భారత పాస్‌పోర్ట్ నిలిచింది. మన పొరుగు దేశాల్లో మాల్దీవులు 58వ స్థానంలో నిలవగా.. చైనా 62, భూటాన్ 87, మయన్మార్, 92, శ్రీలంక 96, బంగ్లాదేశ్ 97, నేపాల్ 98వ స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ 101వ స్థానంలో ఉంది.
వీసా లేకున్నా భారతీయులు పాస్‌పోర్ట్‌తో ఏయే దేశాలకు వెళ్లొచ్చో చూద్దాం..
అంగోలా, భూటాన్, బార్బడోస్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బురుండీ, కంబోడియా, కేప్ వెర్డీ ఐలాండ్స్, కొమొరో ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడర్, ఇథియోపియా, ఫిజి, గాబన్, గ్రెనెడా, గినియా బిస్సౌ, హైతీ, ఇండోనేసియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, కెన్యా, కిరిబతి, లావోస్, మడగాస్కర్, మలేసియా, మాల్దీవులు, మార్షల్ ఐలాండ్స్, మారిటేనియా, మారిషస్, మైక్రోనేషియా, మాంటీసెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియూ, ఒమన్, పలవ్ ఐలాండ్స్, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్, సియెర్రా లీయోనే, సోమాలియా, శ్రీలంక, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్ లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యూనీషియా, తువాలు, వనౌతు, జింబాబ్వే.