తాడిమర్రి మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే...... మర్రిమాకులపల్లికి చెందిన సాకే బాలవీరమ్మ ఆదివారం రాత్రి తన పెద్ద కుమారుడు నరసింహుడు ఇంటి వద్ద నిద్రిస్తుండగా.. చిన్నకుమారుడు ఈశ్వరయ్య వెళ్లి మద్యానికి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అయితే ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన అతను అక్కడే ఉన్న కొడవలితో దాడి చేశాడు. బాలవీరమ్మ ఎడమచెయ్యి దాదాపుగా తెగిపోయింది. దీంతో స్థానికులు ఆమెను బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ నాగస్వామి సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి జరిగిన విషయాన్ని గ్రామస్థులను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.