ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ఇంట సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఎన్నికల విధుల రీత్యా ఆదివారం విజయవాడలోని తమ నివాసంలో కుటుంబంతో కలిసి పండుగ జరుపుకొన్నారు. దిల్లీరావు సతీమణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తమ ఇంట రంగుల ముగ్గులు వేసి, బంతిపూలతో అలంకరించారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రశాంతి పట్టు చీర, దిల్లీరావు లాల్చీపైజమా, పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించారు. హరిదాసు కీర్తనలు, కోడి పుంజులు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం ఇంటి వద్ద భోగి మంటలు వేశారు. పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు వచ్చి వారికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రతి లోగిలి సంతోషంగా సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.