వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లెలో ఆదివారం జల్లికట్టు జరిగింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కోడెగిత్తలతో పాటు వీక్షించడానికి జనం ఆ గ్రామానికి తరలి వచ్చారు. జల్లికట్టు నిర్వహణకు గ్రామంలో అల్లిని ఏర్పాటు చేశారు. కోడె గిత్తల కొమ్ములను జివ్వి, రంగులు అద్ది, ఆ కొమ్ములకు బహుమతులుగా ఉపయోగించే పట్టీలను వివిధ దేవుళ్లు, రాజకీయ ప్రముఖులు, కోడెగిత్తల కుటుంబీకుల ఫొటోలతో కూడిన ఆకృతుల్లో కట్టారు. అల్లిలో సిద్ధంగా ఉన్న యువకుల వైపు గిత్తలను తరిమారు. వీటిని నిలువరించడానికి యువకులు ప్రయత్నించే క్రమంలో కొందరు గిత్తల కింద పడి గాయపడ్డారు. ఓ యువకుడు గిత్త కొమ్ములను పట్టుకుని, గిత్తపైనే ఎక్కి చాలా దూరం వెళ్లాడు. అల్లి నుంచి వెళ్లే క్రమంలో సమీపంలో కుంటలో గిత్తలు పడ్డాయి. పట్టీలను దక్కించుకునే క్రమంలో యువకుల మధ్య వాగ్వాదం, వాదోపవాదాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం మిద్దెలు, గోడలు ఎక్కి జల్లికట్టును చూశారు.