చిత్తూరు వాసులకు శుభవార్త. 435 కిలోమీటర్ల పొడవైన చెన్నై-బెంగళూరు-మైసూర్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లో చిత్తూరు భాగం కానుంది. ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ అయిన చెన్నై నగరాన్ని.. స్టార్టప్ హబ్‌గా పేరొందిన బెంగళూరు, కర్ణాటక సాంస్కృతిక రాజధానిగా పేరొందిన మైసూర్ నగరాల మధ్య పరుగులు తీయనున్న హైస్పీడ్ రైలు చిత్తూరు మీదుగా వెళ్లనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ రైలు సదుపాయం అందుబాటులోకి వస్తున్న తొలి నగరం చిత్తూరు కావడం విశేషం.
చెన్నై-మైసూర్ నగరాల మధ్య దూరం 435 కిలోమీటర్లు. హైస్పీడ్ రైలు గరిష్టంగా గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దాని ఆపరేషనల్ స్పీడ్ 320 కిలోమీటర్లు కాగా.. సగటు వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఈ హైస్పీడ్ రైల్ సేవలు అందుబాటులోకి వస్తే.. చిత్తూరు నుంచి అరగంటలోపే చెన్నైకి వెళ్లొచ్చు. 40 నిమిషాల్లోగా చిత్తూరు నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. చెన్నై-బెంగళూరు-మైసూర్ హైస్పీడ్ రైల్ కారిడార్ దక్షిణ భారతదేశంలో తొలి హైస్పీడ్ రైల్ కారిడార్ కాగా.. హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ రెండోది. ముంబై-హైదరాబాద్ నగరాల మధ్య కూడా హైస్పీడ్ రైల్ కారిడార్ రానుంది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఇంకా మొదలు కాలేదు.
చెన్నై-బెంగళూరు-మైసూర్ కారిడార్‌లో పరిశ్రమలు, టెక్ పార్క్‌లు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, టౌన్‌షిప్‌లు ఎక్కువ. ఈ మూడు నగరాల మధ్య ఏర్పాటు కానున్న హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది. ప్రతిపాదిత అలైన్‌మెంట్ ప్రకారం.. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ తమిళనాడులోని చెన్నైతోపాటు పూనమల్లి, అరక్కోణం, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని బంగారపేట, బెంగళూరు, చెన్నపట్న, మాండ్య, మైసూర్ నగరాలను కలుపుతుంది.
అలైన్‌మైంట డ్రాయింగ్ ప్రిపరేషన్, సర్వే, ఇతర అవసరాల అన్వేషణ కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇప్పటికే కాంట్రాక్టులిచ్చింది. ఇప్పటికే ఈ కారిడార్ వెంబడి ల్యాండ్ సర్వే జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న వారితో ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్ భేటీ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ కచ్చితమైన అలైన్‌మెంట్, స్టేషన్లు, ఎంత మంది ప్రయాణిస్తారు, ఛార్జీలు ఎంత ఉండనున్నాయనే వివరాలు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ద్వారా తెలుస్తాయి.