సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వారికి ఫుల్ జోష్. కొత్త అల్లుళ్లు, కొత్త కోడళ్లతో తెలుగు లోగిళ్లు మరింత సందడిగా మారుతాయి. కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా సుమారు 300 రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు అత్తింటివారు. అనకాపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషితను విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్‌కు ఇచ్చి డిసెంబర్‌లో వివాహం జరిపించారు. వివాహం తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి పండుగకు నవ దంపతులను ఇంటికి ఆహ్వానించారు సాయి గోపాల్ రావు. కొత్త అల్లుడికి రాచ మర్యాదలు చేశారు.
300 పైగా పిండి వంటలను తయారు చేయించి, అల్లుడిని సర్‌ప్రైజ్ చేశారు గోపాల్ రావు. ఒక్కో వంటను స్వయంగా తమ చేతులతో తినిపించి అల్లుడికి రుచి చూపించారు. వీటిలో వివిధ రకాల స్వీట్లు, హాట్‌లు, రైస్ ఐటమ్స్, పలు రకాల కూరలు, పచ్చళ్లు, టిఫిన్ ఐటమ్స్‌తో పాటు పండ్లతో తయారు చేసిన పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ ఉన్నాయి. అత్తింటి వారి ఆథిత్యానికి అల్లుడు దేవేంద్రనాథ్ మురిసిపోయారు. కుటుంబసభ్యులు ఈ వీడియోలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కిందటి ఏడాది ఏలూరుకు చెందిన బుద్ధా మురళిధర్ కుటుంబం సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి 379 రకాల వంటలతో ఆతిథ్యం ఇచ్చారు. ఇటీవలి కాలంలో ఇవే రికార్డు స్థాయి వంటలు.