గిరిజనుల ప్రాణాలతో వైసీపీ సర్కార్ చెలగాటమాడుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. విజయనగరం జిల్లా, చిట్టంపాడుకు చెందిన గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానని ఆయన అన్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను, ఆరు నెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే గతంలో ఫీడర్ అంబులెన్స్ లు తెచ్చామని... ఇప్పుడు వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తల్లి, బిడ్డ చనిపోడానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా? అని ప్రశ్నించారు.
'కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? మృతదేహాన్ని తీసుకు వెళ్ళడానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేరా? ఏమైపోయాయి అంబులెన్సులు? పుట్టెడు దుఃఖంలో భార్య మృతదేహాన్ని బైక్ మీద తీసుకువెళ్లాల్సి రావడం ఎంత దయనీయం? ఎంత బాధాకరం? గిరిజనులకు ఎందుకీ దుస్థితి?' అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని... ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. చిట్టంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.