అనుకున్నదే జరిగింది. స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుకుంటూ సూచీలు రికార్డు గరిష్టాలకు చేరిన సంగతి తెలిసిందే. అయితే కరెక్షన్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఇన్వెస్టర్లంతా కంగారు పడుతున్న తరుణంలోనే సరిగ్గా అదే జరిగింది. జనవరి 17 (బుధవారం) సెషన్‌లో భారత సూచీలు భారీగా కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఇవాళ ఒక్కరోజులోనే 1628 పాయింట్లు కోల్పోయి 71,500.76 మార్కు వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 460 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 21,571.95 వద్ద సెషన్‌ను ముగించింది. 2022, జూన్ తర్వాత దేశీయ సూచీలు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మార్కెట్ల నష్టాలకు చాలానే కారణాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు, హెవీ వెయిట్ షేరు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ భారీగా పతనం కావడం. ఇవాళ 8.16 శాతం నష్టంతో రూ. 1542.15 వద్ద షేరు స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో అంతకుమించి నష్టంతో కదలాడింది. చివరికి కాస్త కుదురుకుంది. కిందటి రోజు ఈ కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభం పెరిగినప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఒత్తిడిలో పడిపోయారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలకు తోడు మిడిల్ ఈస్ట్‌లో ఆందోళనకర వాతావరణం కొనసాగుతుండటం.. వడ్డీ రేట్ల కోతకు సంబంధించి ఆశలు ఆవిరైపోవడం వంటివి మార్కెట్లలో నష్టాలకు ఇతర కారణాలుగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇటీవల రికార్డు గరిష్టాలకు సూచీలు చేరిన నేపథ్యంలోనే.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ లాభాల కొనుగోలుకు మొగ్గుచూపగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంకా అమెరికా, ఐరోపా మార్కెట్లు కూడా క్రితం సెషన్‌లో నష్టపోయాయి. డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్, ఇతర కమొడిటీల ధరలు కూడా పెరగడం మరో కారణం.
బీఎస్ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.09 శాతం నష్టపోగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.90 శాతం పడిపోయింది. ఇక బీఎస్ఇ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ. 375 లక్షల కోట్ల నుంచి రూ. 370.4 లక్షల కోట్లకు తగ్గింది. సింగిల్ సెషన్‌లోనే రూ. 4.6 లక్షల కోట్లు పడిపోవడం గమనార్హం.
ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా పడిపోయాయి. ఐటీ స్టాక్స్ మాత్రం పుంజుకోవడం విశేషం. ఇవాళ నిఫ్టీ 50లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైసెస్ షేరు 1.28 శాతం పెరిగింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో కూడా లాభాలు నమోదు చేశాయి. నష్టాల లిస్ట్ చూస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 8 శాతానికిపైగా పతనంతో తొలి స్థానంలో ఉండగా.. టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తర్వాత వరుసగా ఉన్నాయి.