ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఇక సోషల్ మీడియాలోనైతే.. రెండు పార్టీల అధికార పేజీలు ఒకరిపై మరొకరు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో.. ఫ్యాన్ పేజీ తరహాలో వార్ మొదలుపెట్టాయి. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా.. చంద్రబాబు నాయుణ్ని సీనియర్ ఎన్టీఆర్ విమర్శిస్తున్న వీడియోను వైఎస్సార్సీపీ తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. అంతటి మహానుభావుడని చంపాలని ఎలా అనిపించింది నీకు చంద్రబాబు అని టీడీపీ అధినేతను ట్యాగ్ చేసి పోస్టు చేసింది. సీబీఎన్ కిల్డ్ ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది.
దీనికి తెలుగుదేశం పార్టీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘తండ్రిని హెలికాప్టర్ ఎక్కించి, బాబాయ్‌ని గొడ్డలితో నరికి నరికి చంపి, ఆస్తి కోసం చెల్లిని, తల్లిని గెంటేసిన కిరాతకుడివి కదా! అందరి చావులు, మనం చంపినట్టే ఉంటాయి అనిపించటంలో వింత ఏముందిలే @ysjagan ! ఈసారి ఎన్నికల ముందు ఎవరిని వేస్తున్నావ్ ?’ అంటూ బదులిచ్చింది. ఇక్కడితో టీడీపీ, వైఎస్సార్సీపీ ట్విటర్ వార్ ఆగిపోలేదు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రోడ్డు ప్రమాదంలో చంపాలనుకున్నాడంటూ వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. ‘2019 ఎన్నికల్లో ఎక్కడ నీ రాజకీయానికి అడ్డుపడతాడని నందమూరి హరికృష్ణను కార్ యాక్సిడెంట్ చేయించి, చివరికి ఆయన చావు ని కూడా సింపతీ కోసం వాడుకుంది నువ్వు కాదా చంద్రబాబూ? నీ కొడుకు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం పాదయాత్ర మొదటి రోజే నందమూరి తారకరత్నను పొట్టనబెట్టుకుని సింపతీ పొందాలనుకుంది నువ్వు కాదా చంద్రబాబూ?
ఎక్కడ రేపు నీ కొడుకు రాజకీయ భవిష్యత్తుకి అడ్డొస్తాడేమో అని జూనియర్ ఎన్టీయార్ ని హతమార్చాలని కుట్రలు పన్నుతున్నది నువ్వు కాదా చంద్రబాబూ? నీ వల్ల జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రాణహాని ఉందని ఈ రోజు అందరికీ అర్థమవుతుంది! సీనియర్ ఎన్టీయార్‌ను చంపించడం దగ్గర నుంచి నేటి వరకూ శవరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ నువ్వు కాదా చంద్రబాబూ?’ అని వైఎస్సార్సీపీ అఫిషియల్ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తారక్ ఆకాశమంత ఎత్తులో ఉన్నాడన్న మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.. తారక్ ప్లెక్సీలను తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం ఉండదు.. విమర్శలు చేసిన వారికే నష్టమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ఈస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకుంటున్నారంటే.. ఇక ముందు ముందు ఇంకే స్థాయిలో ఒకరిపై మరొకరు బురదజల్లుకుంటారో మరి..?