విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లే అవుట్ చేసి అమ్మకాలు చేపట్టడంపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధిందించింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూములు ఉపయోగించకూడదని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సినీ అవసరాలకు వినియోగించేందుకుగాను 35 ఎకరాల భూమిని 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రామానాయుడు స్టూడియోకు కేటాయించింది. అయితే కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములను లేఅవుట్ చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించేందుకు జగన్ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కేసు కొట్టివేయడంతో.. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
రామకృష్ణబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఆ భూములను ఎందుకు కేటాయించారు ? ప్రస్తుతం లే అవుట్ వేశారా? కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ భూములను సినీ స్టూడియో నిర్మాణానికి కేటాయించారని.. అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆ భూముల అమ్మకంపై స్టే విధించింది. ఈ ఏడాది మార్చి 11లోపు స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.