ఇటీవల కాలంలో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. కరోనా, జీకా, ఎన్1హెచ్1, జేఎన్ వేరియంట్ ఇలా కొత్తకొత్త రోగాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అయితే అదే స్థాయిలో వైద్యశాస్త్రం కూడా అభివృద్ది చెందుతోంది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా.. మంగళగిరి ఎయిమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి వ్యాధి కారకాలనైనా.. ఈ మిషన్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే గుర్తించే ఛాన్స్ ఉంది.
వ్యాధి సంక్రమణకు కారణమైన బ్యాక్టీరియా లేదా ఫంగస్‌ను గుర్తించేందుకు 'మాల్దీ టాఫ్' (మ్యాట్రిక్స్ అసిస్టెడ్ లేజర్ డిజారప్షన్ అయానైజేషన్ టైం ఆఫ్ ఫైట్) అనే వైద్య పరికరాన్ని క్లినికల్ మైక్రోబయాలజీ విభాగం కోసం తెప్పించారు. ఎయిమ్స్ సీఈఓ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి దీన్ని గురువారం (జనవరి 18) ప్రారంభించారు. ఈ పరికరంతో బ్యాక్టీరియా, ఫంగస్‌ను త్వరగా గుర్తించడంతో రోగికి సత్వర చికిత్స అందించేందుకు వీలవుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో ఫంగస్ గుర్తింపునకు వారం, బ్యాక్టీరియా గుర్తించేందుకు 18 గంటలు పడుతోందని చెప్పారు. అప్పటి వరకూ రోగి అనారోగ్య లక్షణాలను బట్టి అధికంగా యాంటీబయోటిక్స్ వినియోగించాల్సి వస్తోందన్నారు.
వీటి వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త యంత్రం ఉపయోగపడుతుందని సీనియర్ వైద్యులు డాక్టర్ సుమిత్ రాయ్ వెల్లడించారు. దీంతోపాటు టీబీని గుర్తించే సీబీనాట్ మిషన్‌నూ అందుబాటులోకి తెచ్చారు. దీనిద్వారా పల్మనరీ, ఎక్స్‌ట్రా-పల్మనరీ నమూనాలతో టీబీని గుర్తించే వీలుంది. ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఐవీ, హెచ్‌సీవీ వైరల్ లోడునూ దీనితో గుర్తిస్తారు. ఈ పరికరాలు పరిశోధనలకూ ఉపయోగపడతాయని డాక్టర్లు వెల్లడించారు.