దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తిని బర్తరఫ్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని పీలేరు టీడీపీ కార్యాలయంలో నల్లారి కిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు వేయడం అభినందనీయమన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషాను సస్పెండ్ చేయడం అతని సర్వీసులో మాయని మచ్చని గుర్తుచేశారు. దొంగ ఏపిక్ కార్డుల తయారీలో సూత్రదారులైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలపై భవిష్యత్తులో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని కోరారు. తిరుపతిలో జరిగిన ప్రతి ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిందని మండిపడ్డారు. వారికి సహకరించిన అధికారులు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. దొంగ ఓట్లపై మొదటి నుంచి తాను ఫిర్యాదు చేస్తున్నానని ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు.