ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో ఆకాశమంత అంబేద్కరుడు.. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 07:54 PM

దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా (సామాజిక న్యాయ మహాశిల్పం) నిలవనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహ విశేషాలెంటో ఇప్పుడు చూద్దాం.


దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. విగ్రహం మెుత్తం ఎత్తు 206 (81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం) అడుగులు. మార్చి 21, 2022లో పనులు ప్రారంభం కాగా.. విగ్రహ తయారీకి 120 టన్నుల కాంస్యం వాడారు. 400 మెట్రిక్ టన్నుల స్టీలు, 2,200 టన్నుల శాండ్ స్టోన్ వాడారు. విగ్రహం తయారీకి మెుత్తం అయిన ఖర్చు. రూ. 404.35 కోట్లు.


18.18 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందులో అందమైన గార్డెన్‌, వాటర్‌ బాడీస్, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్‌ చేసుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. జీ ప్లస్ టూగా నిర్మించగా.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్‌ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియంలు ఏర్పాటు చేశారు.


ఫస్ట్‌ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేద్కర్‌కు దక్షిణ భారతదేశశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి.


ఇక సెకండ్‌ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.


మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్‌ సెంటర్, వెహికల్‌ పార్కింగ్‌ ఉన్నాయి. కన్వెన్షన్‌ సెంటర్‌ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.


బిల్డింగ్‌ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్‌ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్‌ సిస్టం ఉన్నాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్ పీఠం (పెడస్టల్‌)ను రూపొందించారు. విగ్రహ బేస్ నిర్మాణానికి రాజస్థాన్‌కు చెందిన పింక్‌ రాక్‌ను ఉపయోగించారు.


అంబేద్కర్‌ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌ వర్క్‌ ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్‌ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది.


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహాన్ని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు.


స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్‌ నుంచి వచ్చిన కూలీలు రెండేళ్ల పాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.


దేశంలో మూడో పెద్ద విగ్రహం..


ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా.. దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవది. మొదటిది స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంది. రెండవది శంషాభాద్ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత విజయవాడలో ప్రారంభం కానున్న 210 అడుగుల ఎత్తులోని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం.


హైదరాబాద్‌లోనూ 125 అడుగుల విగ్రహం..


హైదరాబాద్‌లోనూ గత ఏడాది ఏప్రిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు కాగా.. మెుత్తం విగ్రహం ఎత్తు 174 అడుగులు. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బేస్‌మెంట్‌లోనూ మ్యూజియం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com