త్వరలో జరగనున్న ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సుదీర్ఘ కసరత్తు తర్వాత మరికొన్ని స్థానాలకు ఇంఛార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కాగా.. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జిలను వైసీపీ ప్రకటించింది. ఇప్పడు కూడా ఒక ఎంపీ స్థానంతో పాటు 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. ఇందులో చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంఛార్జీగా నియమించింది.
అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు వీళ్లే..
గోపాలపురం (ఎస్సీ) - తానేటి వనిత (హోం మంత్రి)
జీడీ నెల్లూరు (ఎస్సీ) - రెడ్డప్ప
తిరువూరు (ఎస్సీ) - నల్లగట్ల స్వామిదాసు
సింగనమల (ఎస్సీ) - ఎం. వీరాంజనేయులు
కొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకట్రావు
మడకశిర (ఎస్సీ) - ఈర లక్కప్ప
నందికొట్కూరు (ఎస్సీ) - డాక్టర్ సుధీర్ ధార
కనిగిరి - దద్దాల నారాయణ యాదవ్
ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టటమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగుల పని తీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించి.. వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటిస్తేనే.. తాను అనుకున్నట్టుగా 'వై నాట్ 175' లక్ష్యం చేరుకోగలమని భావిస్తున్నారు. దీంతో.. ఇప్పటికే మూడు విడుతల్లో ఎమ్మెల్యే, ఎంపీలు కలిపి 59 మందిని ప్రకటించిన జగన్.. ఇప్పుడు మరో 9 మందితో నాలుగో జాబితా ప్రకటించారు.