తండ్రి ఉరేసుకున్నాడని తల్లి నుంచి ఫోన్. ఉబికివస్తున్న ఏడుపును పంటిబిగువన ఆపేసి.. ఆగమేఘాలపై ఇంటికి చేరుకున్నాడు. తండ్రిని ఎలాగైనా బతికించుకోవాలని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిశీలించిన వైద్యులు.. అప్పటికే ప్రాణాలు వదిలాడని చెప్పటంతో.. గుండెల నిండా బాధతో మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే.. గుండెలు పగిలే మరో సన్నివేశాన్ని ఆ కుమారుడు చూడాల్సి వచ్చింది. ఉరికి వేలాడుతూ తన తల్లి కనిపించటంతో.. ఆ బిడ్డ మనసు వెయ్యి ముక్కలైంది. అయినప్పటికీ.. తన తల్లినైనా బతికించుకోవాలన్న ఆశతో.. మళ్లీ ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. కానీ.. విధి బలీయమైనది. అప్పటికే ఆ తల్లి ప్రాణాలను బలితీసుకుంది. గంట వ్యవధిలోనే.. అటు తండ్రిని, ఇటు తల్లిని ఇద్దరినీ కోల్పోవటంతో.. ఆ కుమారుడు గుండెలు పగిలేలా రోధించాడు.
అయితే.. ఆ దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోవటానికి కారణం మాత్రం కేవలం 500 రూపాయలు మాత్రమే. మనసును మెలిపెట్టే ఈ ఘటన.. కృష్ణా జిల్లాలోని గుడివాడలో జరిగింది. 500 రూపాయలు పెట్టిన చిచ్చు.. భార్యభర్తల ప్రాణాలు బలితీసుకుంది. గుడివాడకు చెందిన రాంబాబు, కనకదుర్గ దంపతుల మధ్య 500 రూపాయల విషయంలో మాటామాట పెరిగి.. ఘర్షణగా మారింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటలు జారారు. దీంతో.. భార్య మీద తీవ్ర కోపోద్రిక్తుడైన రాంబాబు.. ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించారు. భర్త ఉరి వేసుకున్న విషయాన్ని తల్లి కనకదుర్గ వెంటనే.. కుమారుడికి ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే తన తండ్రిని కొడుకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కానీ.. రాంబాబు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తండ్రి చనిపోయిన విషయాన్ని ఆస్పత్రిలో ఉండగానే.. ఫోన్ ద్వారా కుమారుడు తల్లికి వివరించాడు. భర్త మరణవార్త విని తీవ్ర మనస్తాపానికి లోనైన కనకదుర్గ.. ఇంట్లోనే ఉరివేసుకుంది. తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఉరికి వేలాడుతున్న తల్లిని చూసి కుమారుడు షాకయ్యాడు. అమ్మనైన కాపాడుకుందాం అని కుమారుడు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతని కనకదుర్గ ప్రాణాలు కోల్పోయింది. 500 రూపాయల విషయంలో తలెత్తిన చిన్న గొడవ కారణంగా.. క్షణికావేశంలో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవటం.. సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు.