ప్రతిపక్ష నేతగా నాడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో అమలు చేశారని జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైయస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉరవకొండ పట్టణంలో ఈ నెల 23 న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉరవకొండ పట్టణంలోని తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ప్రభుత్వ అధికారులతో మంత్రి ఇతర నేతలు సమావేశం ఏర్పాటు చేసి చేపట్టవలసిన చర్యలు ఏర్పాట్లను గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలసిల రఘురాం, ఉరవకొండ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ విజయవంతానికి పనులు ఎలా చేపట్టాలన్న విషయంపై అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ నెల 22 నాటికి అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీసులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.