ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెక్‌పోస్ట్‌ల దగ్గర పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అనంతపురం జిల్లాలో కూడా పోలీసులు, సెబ్ అధికారులు సోదాలను చేపట్టారు. ఈ క్రమంలో మరోసారి భారీగా డబ్బులు దొరికాయి. విడపనకల్లు మండలంలోని హావళిగి చెక్‌పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. సోమవారం మధ్యాహ్నం హావళిగి సరిహద్దు చెక్ పోస్టు దగ్గర పాల్తూరు ఎస్‌ఐ, ఎక్సైజ్ చెక్‌పోస్టు ఎస్‌ఐలు తమ సిబ్బందితో వాహనాల సోదాలు చేపట్టారు. ఇంతలో ఓ వ్యక్తి చెక్‌పోస్ట్ వైపు వచ్చారు.. పోలీసులు అనుమానంతో ఆపి చెక్ చేస్తే ఓ బ్యాగులో డబ్బులు దొరికాయి.
అతడి దగ్గర మొత్తం రూ. 10లక్షలు ఉన్నట్లు వాటిని అతడు తరలిస్తున్నట్లు గుర్తించారు. అతడిని ప్రశ్నించగా.. తనది కర్ణాటకలోని బళ్లారి జిల్లా చాగనూరు అని.. తన పేరు చాకలి వీరభద్రప్ప అని వివరాలు తెలిపాడు. ఉండబండలో జొన్నలు అమ్మిన రైతులకు డబ్బు చెల్లించేందుకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు. జొన్న పంటలు అమ్మిన వారికి చెల్లించేందుకు ఈ డబ్బులు తీసుకెళుతున్నట్లు తెలిపాడు. అయితే సరైన ఆధారాలు చూపకపోవడంతో డబ్బులు, ద్విక్రవాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా భారీగా డబ్బుల్ని తీసుకెళుతుంటే.. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వెంట తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ తనిఖీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు చెబుతున్నారు. రైతువారీగా తీసుకొచ్చే డబ్బులకు సంబంధించి తమ దగ్గర ఎలాంటి పత్రాలు ఉండవు అంటున్నారు.