డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో కేసుల ఎత్తివేతపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చిన సమయంలో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనల్లో పోలీసులు వందలాదిమందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్ని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ జంగా బాబూరావు ఈ వ్యాజ్యాన్ని వేశారు.
మొత్తం ఆరు ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబరు 20న జారీ చేసిన జీవో 1566 అమలును నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోను కొట్టేయాలని కోరారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ, డీఎస్పీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2022 మే నెలలో చోటు చేసుకున్న ఈ హింసాత్మక ఘటనలకు బాధ్యులుగా పేర్కొంటూ వందల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారని పిటిషనర్ ప్రస్తావించారు.
అమలాపురంలో పోలీసులపై రాళ్లదాడి చేశారన్నారు. మంత్రి, అధికార పార్టీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఐపీసీ 307(హత్యాయత్నం) వంటి కీలక సెక్షన్లు ఉన్నాయని గుర్తు చేశారు. తీవ్ర నేరాల్లో నిందితులపై కేసులను ఉపసంహరించడానికి చట్టం అనుమతించదన్నారు. కేసుల ఉపసంహరణకు కారణాలేమిటో జీవోలో పేర్కొనలేదని తెలిపారు. కేసుల ఉపసంహరణకు సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని ఆదేశించిందని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుల ఉపసంహరణకు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకొని జీవో జారీచేసిందని పిల్‌లో ప్రస్తావించారు. అమలాపురం పట్టణ, తాలూకా పోలీస్ స్టేషన్లలో నమోదైన మొత్తం 6 ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశించాలంటూ డీజీపీకి స్పష్టం చేసిందన్నారు. అయితే అందుకు కారణాలు జీవోలో పేర్కొనలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు సీఆర్పీసీ సెక్షన్ 321, బల్వంత్ సింగ్ కేసుతో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ పిల్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.. త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపిస్తుంది అన్నది కూడా చూడాలి.