దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. 500 ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య వివాదం సమసిపోయి.. భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవం అయింది. ఈ క్రమంలోనే అయోధ్యలో కొలువైన బాలరాముడిని చూసి కోట్లాది మంది రామ భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. అద్భుతమైన రూపం, చిరు ధరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇక అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాలరాముడి ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే ఒక కొత్త వీడియో ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
అయోధ్య గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్నింటికన్నా ఒక వీడియో మాత్రం బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న బాలరాముడిని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూసినట్లే కనిపిస్తోంది. బాలరాముడు కళ్లు తెరిచి ఉన్నట్లు ఉన్న ఆ వీడియోను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. చిరునవ్వుతో కంటి రెప్పలు కొడుతూ తలను అటూ ఇటూ కదిలిస్తూ చూస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది.
అయితే అయోధ్య గర్భగుడిలో దర్శనమిచ్చిన బాల రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొందరు ఎడిటింగ్ చేసి ఈ వీడియోను తయారు చేశారు. ఇది నిజమైన వీడియో కానప్పటికీ.. రామ భక్తులకు మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇలాంటి వీడియోలు చేయడం సర్వసాధారణమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయోధ్యలో రాముడిని చూసినప్పుడు ఎంత అనుభూతి కలుగుతుందో ఈ వీడియో చూస్తే అంతే అనుభూతి కలుగుతోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం రామ భక్తులకు తెగ నచ్చేస్తోంది.