ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విచిత్రమైన సన్నివేశం కనిపించింది. ఓ కొండముచ్చు స్కూల్ విద్యార్థులతో స్నేహం చేసింది. వాళ్లతో కలిసి భోజనం చేసింది.. ఆటలాడింది. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో ఈ సీన్ కనిపించింది. కొండముచ్చు మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసేందుకు ప్లేట్లతో స్కూల్ మైదానంలోకి వచ్చి కూర్చున్న సమయంలో ఓ కొండ ముచ్చు అక్కడికి వచ్చింది. మైదానం అంతా కలియ తిరిగింది.. విద్యార్థులతో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఆ తర్వాత వారితో పాటే భోజనం తినింది. ఓ విద్యార్థి తన పళ్లెంలోని ఆహారాన్ని దానికి పెట్టాడు. ఆ భోజనం టేస్టీగా ఉందనుకుందో ఏమో.. కొండముచ్చు విద్యార్థితో కలిసి తాను కూడా అదే పళ్లెంలో తినేసింది. ఆ విద్యార్థి, కొండముచ్చు ఎదురెదురుగా కూర్చుని ఒకే పళ్లెంలో అన్నాన్ని పంచుకున్నారు. ఈ సీన్ చూసిన తోటి విద్యార్థఉలు అక్కడికి ఒక్క పరుగున వచ్చారు. కొండముచ్చు చేస్తున్న చేష్టలను చూసి ఆనందించారు.
భోజనం తర్వాత కొండముచ్చు ఓ దిమ్మ మీద కూర్చుంది.. అక్కడ స్కూల్ విద్యార్థులతో కలిసిపోయింది. కొండముచ్చును చూసి విద్యార్థులు భయపడకుండా దాని శరీరంపై నిమురుతూ కొద్దిసేపు సరదాగా గడిపారు. అలా విద్యార్థులకు కొండముచ్చుకు మంచి స్నేహం ఏర్పడింది. అనంతరం ఆ కొండముచ్చు పక్కనే నిలిపి ఆపి లారీ అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయింది. అనంతరం విద్యార్థులకు బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొండముచ్చు చేసిన చేష్టల్ని చూసి విద్యార్థులు మురిసిపోయారు.