విజయవాడలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో రాధా, ఉమా వర్గీయుల మధ్య పోస్టుల యుద్ధం జరుగుతోంది.వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. ఇదంతా ఉమా వర్గీయులు పని అంటూ రాధా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు రాధా వర్గం బోండా ఉమా వర్గాన్ని టార్గెట్ చేస్తూ కౌంటర్ ఇస్తోంది.
తాజాగా ఉమా టార్గెట్‌గా సోషల్ మీడియాలో కౌంటర్‌గా పోస్టులు మొదలయ్యాయి. వంగవీటి రాధాను నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. 'పదవి కోసం పార్టీని బెదిరించాలా..?.. చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా..?.. దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా?.. కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోవాలా..?.. పదవి రాకపోతే కాపుల గొంతుకోసారని పార్టీకి ,కులానికి మధ్య విరోధం పెంచాలా..?.. ఈసారి టికెట్ రాదని అధికార పార్టీతో చర్చలు జరపాలా, అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా?' అంటూ కొందరు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి.
రాధాపై ఏడు పాయింట్లతో పోస్టులు పెడితే.. ఉమాపై పదిహేడు పాయింట్లతో పోస్టులు మొదలయ్యాయి. రాధా వర్గమే ఇది చేసినట్టుగా ఉమా వర్గం భావిస్తోంది. విజయవాడ సెంట్రల్ సీట్ కోసం రాధా, ఉమా వర్గాల మధ్య కోల్డ్ వార్‌తో రాజకీయం హీటెక్కింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమా, రాధా వర్గాల కోల్డ్ వార్‌తో రాజకీయం రసవత్తరంగా మారినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ పోస్టుల వ్యవహారంపై బోండా ఉమా, వంగవీటి రాధాలు స్పందించాల్సి ఉంది.
విజయవాడ సెంట్రల్ సీటు 2009లో ఏర్పాటుకాగా.. అక్కడి నుంచి 2009 ఎన్నికల్లో మల్లాది విష్టు కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. వంగవీటి రాధా ప్రజారాజ్యం నుంచి పోటీచేయగా.. టీడీపీ పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను సీపీఐకి ఇచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు బోండా ఉమాను ఓడించారు. ఇక వంగవీటి రాధా 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినా పోటీ చేయలేదు.
ఇక వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ తరఫున సీటు ఖాయమని దేవినేని ఉమా ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వంగవీటి రాధా కూడా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య వార్ ముదురుతోంది. మరి టీడీపీ అధిష్టానం ఈ వర్గపోరుకు ఎలా చెక్ పెడుతుంది.. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారన్నది చూడాలి.