కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ముదినేపల్లి మండలం చినకామనపూడిలో . గన్ పౌడర్ పేలిన ఘటనలో ఓ కూలీ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చినకామనపూడిలో ఓ రైతుకు చెందిన చేపల చెరువు దగ్గర అసోంకు చెందిన బికాస్ బరో, రిటూ బరో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. చెరువులపై చేపలు తినేందుకు వచ్చే పిట్టలను తుపాకీతో కాల్చి చంపుతుంటారు. ఈ క్రమంలో తుపాకీలో వాడేందుకు గన్ పౌడర్ తయారుచేస్తుండగా హఠాత్తుగా పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రిటూ బరో ఎడమ చేయి పూర్తిగా తునాతునకలు అవడంతో పాటు, తలకు బలమైన గాయాలు అవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. బికాస్ బరోకు కూడా తీవ్ర గాయాలు అవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. అయితే వైద్యుల సిఫారసు మేరకు మెరుగైన వైద్యం కోసం బికాస్‌ను విజయవాడకు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం రిటూ బరో మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.