మరోసారి జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన షర్మిల.. గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తీరుపై షర్మిల ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 750 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తే... నిర్వహణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ దుయ్యబట్టారు. రూ, 10 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు నిలబడుతుందని... లేకపోతే నిలబడే అవకాశం లేదని ఎస్ఈ చెబుతున్నారని అన్నారు.
ప్రాజెక్ట్ నిర్మించి కూడా ఉపయోగం లేకుండా పోతుందని షర్మిల అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని... ప్రాజెక్టుకు చేయాల్సిన మరమ్మతులు వెంటనే చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గేటు నీటిలో తేలుతోందని... దీన్ని చూస్తే మీరే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ పనితీరు ఇదే అని ఆ గేటు సాక్ష్యం చెబుతోందని షర్మిల ఎద్దేవా చేశారు. అలాగే, గత టీడీపీ ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టు కోసం ఏం చేసిందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
ఇదే సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సంబంధిత మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తాడే తప్ప... పని చేయడట అని ఆమె ఎద్దేవా చేశారు. ‘గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నాడు.. జగన్ అన్నకు మరమ్మత్తులు చేయించడానికి మనసు రావడం లేదు.. ఇదేనా YSR ఆశయాలను నిలబెట్టడం అంటే. వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ ను పట్టించుకోని మీరు ఆయన వారసులు ఎలా అవుతారో చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరవండి..లేదంటే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది.’ అని అన్నారు.
ప్రకాశం జిల్లా వాసుల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు గుండ్లకమ్మ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. కానీ, కానీ ఇప్పుడా ప్రాజెక్టు పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. ఏటా ఒక్కో గేటు చొప్పున కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది.
ప్రకాశం జిల్లాలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు, ఒంగోలు నగరం సహా పలు మండలాలకు తాగునీరు అందించాల్సిన గుండ్లకమ్మ ప్రాజెక్టులో ప్రతీ సీజన్‌లో ఒక్కో గేటు కొట్టుకుపోతున్న కారణంగా నీటిని నిల్వచేయడం ప్రశ్నార్థకమవుతోంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు
2004 ఎన్నికలకు కొన్ని నెలల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం మారి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేశారు. 2008లో ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ, నిర్వహణ పట్టించుకోకపోవడంతో ప్రాజెక్ట్ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa